Friday, November 30, 2018


బెంగళూరు లోని ఒక కంపెనీ లో వున్న తెలుగు వారందరూ కలిసి వన భోజనాలు ప్లాన్ చేస్తే తప్పులా కనిపించదు. 
అమెరికా లో భారతియులందరూ కలిసి పార్టి నిర్వహిస్తే తప్పు లా కనిపించదు 
కార్తీక మాస కుల భోజనాల మీద ఎందుకంత వివాదం జరుగుతుంది?

ముందే చెప్తున్నా.. కాస్త బుర్ర పెట్టి చదవండి... నేను ఇక్కడ మంచి చెడూ నిర్ణయించట్లేదు. మన సమాజం లో అలోచనా తీరు ని కేవలం అనాలిసిస్ చేస్తున్నా. నా చిన్నప్పటి నుండీ ప్రవర్తన / అలోచనా తీరు లో మార్పులే ఈ పోస్టు కి కారణం. 
కులం పేరిట ఎవరైనా గ్రూపు కడితే వారి గురించి మనకి సాధారణం గా వినిపించే మాటలు: 
1. కుల గజ్జి మనుషులు.
2. ఈ కాలం లో ఇంకా కులమేంటి 
3. కులం కూడు పెడుతుందా?

నాకు ఏమనిపిస్తుందంటే అసలు ఈ గ్రూపులు కట్టే అలోచనా విధానం మనిషి లో అంతర్భాగం. అది దేన్ని ఐనా బేస్ చేసుకుని కడతారు. భాష/మతం/ప్రాంతం/ కులం/ రాష్ట్రం/ జిల్లా / దేశం/ రంగు/ జాతి / డబ్బు / ఉద్యోగం / చెప్పుకుంటే చాలా వున్నాయి.
ఉ.దా: కుల సంఘాలు, తానా, 

గ్రూపు కట్టడానికి కారణం ఎదైనా వుండొచ్చు. "మాకు అన్యాయం జరుగుతుంది" / "మేము అందరం సమిష్టి గా వున్నాం .. ఇది మా బలం అని చాటుకోవడం" / "అందరు కలిసి వుంటే ఆపదలో ఒకరికొకరు తోడు నిలుస్తారు లే". "అందరం ఒక ఆశయం కోసం కలిసాం" ఇలా కారణం ఏదైనా కావొచ్చు.  

గ్రూపు కడితే ప్రమాదం లేకపోవచ్చు. మేము గొప్పోళ్ళం అవతల గ్రూపు వాళ్ళు ఎదవలు/చేత కాని వాళ్ళు అని అలోచిస్తే అది ప్రమాదం. ఈ అలోచనా తీరు అన్ని రకాల గ్రూపుల్లో కనపడుతుంది. ఇద్దరు తెలుగోళ్ళు కలిసి అరవోడి మీద జోకులు వేస్తాం. హింది వాళ్ళు మన సినిమాల మీద వెశ్తారు. కరుడు కట్టిన దేశ భక్తులు పాకిస్తాన్/చైనా పేరెత్తితే బండ బూతులు తిడతారు.
విచిత్రం ఏంటంటే పైన చెప్పిన పనులు చేసి ఎదో ఒక గ్రూపు లో మెంబర్ గా వుండి ఒక్క కులం విషయం లోకి వచ్చే సరికి ఆదర్శాలు వల్లే వేస్తాం. 
ఏం? ఒక అపార్టుమెంటు లో తెలుగు వారు మాత్రమే కలిసి భోజనాలు ఏర్పాటు చేస్తే తప్పు కానిది ఒక పల్లెటూరి లో ఎవరి కులం వారు వారి వన భోజనాలు పెట్టుకుంటె తప్పెలా అవుతుంది. భాష/దేశం పరం గా గ్రూపు కడితే తప్పు కాదు. కులం పరం గా కడితే మాత్రం తప్పెలా అవుతుంది? 

తప్పు ఎప్పుడంటే ఒక కులం భోజనాలు పెట్టుకుని ఆ మీటింగులో మిగిలిన కులాల్ని చులకన చేస్తే అప్పుడు తప్పు అవుతుంది.
ఎవడి మానాన వాడు పార్టికి వచ్చి తిని కాసేపు సరదాగా గడిపి ఇంటికి పోవడానికి అది కుల సంఘం భోజనం ఐతే ఏంటి? భాషా / ప్రాంత/ రాష్ట్ర సంఘం భోజనాలు ఐతే ఏంటీ. ఒక్క కుల సంఘాల భోజనాలకే ఇంతా విమర్శలు ఎందుకు వస్తున్నాయో నాకు అర్ధం కాదు 

ఇది సంకుచితం ఐతే అదీ సంకుచితమే కదా? లేదంటే అది తప్పులేదంటే ఇది తప్పు లేదు? 
నా ఈ డౌటుని ఎవ్వరైనా కింద కామెంట్ల రూపం లో తీర్చొచ్చు.. 
గ్రూపు కట్టడం వల్ల మంచి ఎంత వుందో చెడు అంతే వుంటుంది. అది ఆ గ్రూపులో వుందే జనాల అలోచన విధానం మీద ఆధార పడి వుంటుంది. 

"కుల సంఘాల భోజనాల్లొ తమ కులం గురించి గొప్పలు చెప్పుకుంటారు. అది మంచిది కాదు". ఆ గొప్పలు రాష్ట్ర సంఘాల మీటింగుల్లో తమ రాష్ట్రం గురించి ..భాషా సంఘాల్లో తమ భాష గురించి కూడా డబ్బ కొట్టుకుంటాం అంతెందుకు పరాయి దేశం లో మన దేశం గురించి డబ్బా కొట్టమా? 

ఒక మనిషి చేసిన గొప్ప పని ని ఆ మనిషి యొక్క దేశం/రాష్ట్రం /జిల్లా/ ఊరు వారు గొప్పగా చెప్పుకుంటే తప్పు లా కనిపించదు.  కాని ఆ మనిషి యొక్క కులస్ఠులు గొప్పలు పోతే అది పెద్ద బూతు లా వినిపిస్తుంది. ఇక్కడ దేశం/రాష్ట్రం /జిల్లా/ ఊరు గొప్ప మాత్రం ఏముంది. అది ఆ మనిషి గొప్ప కదా? 
ఉ.దా: బాహుబలి విజయం తరువాత రాజమౌలీ / ప్రాభాస్ తెలుగు ముద్దు బిడ్డలు అంటె కోపం రాదు. కాని ఆ కులం వారు మా కులం బిడ్డలు అంటె మాత్రం కోపాలు వస్తాయ్. అంతెందుకు బాహుబలి తెలుగు సినిమా కాదు భారతీయ సినిమా అంటేనే మన తెలుగోళ్ళకు ఎక్కడ లేని కోపం వచ్చింది. ఫేస్ బుక్ లో నానా రచ్చ చేశారు.
దీన్నే అంటారు స్టీరియో టైపింగ్ అని..